రాష్ట్రంలో భూ వినియోగంలో గత 15 ఏళ్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని సామాజిక, ఆర్థిక సర్వే-2026లో ప్రభుత్వం పేర్కొంది.
2008-09 నుంచి 2023-24 వరకు భూమి వినియోగ నమూనాలను పరిశీలిస్తే.. సాగు భూమి విస్తీర్ణం పెరుగుతున్నట్లు వెల్లడించింది.
పాడుపడిన భూముల విస్తీర్ణం తగ్గుతున్నట్లు తెలిపింది.
2008-09లో రాష్ట్రంలో 43.33 లక్షల హెక్టా ర్లు ఉన్న సాగు భూమి, 2020-21 నాటికి గరిష్ఠంగా 59.27 లక్షల హెక్టార్లకు చేరింది.
అనంతరం స్వల్ప మార్పులతో 2024-25లో 56.18 లక్షల హెక్టార్ల వద్ద నిలిచింది.
పాడుబడిన భూములకు సంబంధించి 2008-09లో 16.79 లక్షల హెక్టార్లు ఉంటే.. 2020-21లో 2.10 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం సుమారు 27 లక్షల హెక్టార్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం జాతీయ సగటు కంటే ఎక్కువగా 24.69 శాతం ఉందని తెలిపింది.
తెలంగాణలో వ్యవసాయ భూముల ఆధీనం, రైతుల సంఖ్యను జిల్లాల వారీగా విశ్లేషిస్తే విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి.
11వ వ్యవసాయ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయదారులు 70.59 లక్షల మంది ఉండగా, వారి ఆధీనంలో 63.12 లక్షల హెక్టార్ల భూమి ఉంది.
ఎక్కువ మంది రైతులు ఉన్న జిల్లాల జాబితాలో 5.30 లక్షల మందితో నల్లగొండ మొదటి స్థానంలో ఉంది.
సంగారెడ్డి 3.93, రంగారెడ్డి 3.49, సిద్దిపేట 3.36, ఖమ్మం 3.25 లక్షల మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎక్కువ సాగు విస్తీర్ణం ఉన్న జిల్లాల జాబితాలో నల్లగొండ 5.14 లక్షల హెక్టార్లతో మొదటి స్థానంలో ఉంది.
సంగారెడ్డి 3.26, నాగర్‌కర్నూల్ 3.13, రంగారెడ్డి 2.91, వికారాబాద్ 2.71 లక్షల హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తక్కువ మంది సాగుదారులు ఉన్న జిల్లాల జాబితాలో 24 వేల మంది రైతులతో మేడ్చల్ మల్కాజిగిరి, 78 వేల మంది రైతులతో ములుగు జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి (చికెన్‌తో కలిపి) గణనీయంగా పెరిగినట్లు 2026 సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం వెల్లడించింది.
2013-14 ఆర్థిక సంవత్సరంలో 2.30 లక్షల టన్నులుగా ఉన్న మాంసం ఉత్పత్తి 2023-24 నాటికి 11.12 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొంది.
2024-25లో స్వల్ప తగ్గుదల కనిపించినా.. మొత్తం మీద మాంసం ఉత్పత్తిలో ఎక్కువ వృద్ధి నమోదైనట్లు నివేదికలో పేర్కొంది.
రాష్ట్రంలో కొడిగుడ్ల ఉత్పత్తి సంఖ్య 2013-14లో 1006.05 కోట్లు ఉండగా.. 2024-25 నాటికి అది 1935.26 కోట్లకు పెరిగింది.
పాల ఉత్పత్తిలో సుస్థిరమైన వృద్ధి ఉన్నట్లు సర్వే నివేదికలో చూపింది.
2013-14లో సుమారు 39.24 లక్షల టన్నులు ఉన్న పాల ఉత్పత్తి, 2024-25 నాటికి 59.35 లక్షల టన్నులకు చేరింది.
రాష్ట్రంలో మత్స్యరంగం వృద్ధి చెందుతోందని ప్రభుత్వం సర్వే లో వెల్లడించింది.
2008-09 నుంచి 2024-25 వరకు చేపలు, రొయ్యల ఉత్పత్తి నిరంతరం పెరుగుతున్నట్లు తెలిపింది.
చేపల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది.
2008-09లో 1.49 లక్షల టన్నులు ఉన్న ఇన్‌ల్యాండ్ చేపల ఉత్పత్తి, 2024-25 నాటికి 4.62 లక్షల టన్నులకు చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటిదశ పనులకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
గతేడాది కూడా ఇదే మొత్తాన్ని కేటాయించినప్పటికీ.. జీతభత్యాలు, డీపీఆర్ రూపకల్పన వంటి వాటి కోసం రూ.100కోట్ల వరకు విడుదల చేశారు.
నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రాకు బడ్జెట్లో రూ.111.48 కోట్లు కేటాయించారు. సంస్థలోని రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులతో పాటు ఆక్రమణల తొలగింపు వంటి పనుల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశం కంటే పదేళ్ల ముందే వేగవంతమైన పట్టణీకరణను సాధిస్తుందని 2026 సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఏడాది ముగిసే నాటికి రాష్ట్ర పట్టణ జనాభా 50.08 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
ఇది జాతీయ సగటు 36.01 శాతం కంటే చాలా ఎక్కువ అని తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రూ.17.87 లక్షల కోట్లకు చేరి.. 10.7 శాతం వృద్ధి నమోదు చేసినట్లు పేర్కొంది.
ఇందులో సేవా రంగం, పరిశ్రమలు, వ్యవసాయం కీలక భూమిక పోషించినట్లు తెలిపింది.
వ్యవసాయ రంగంలో రైతులకు ఆర్థిక సాయం అందించడం, పరిశ్రమల రంగంలో భారీ పెట్టుబడులు, లైఫ్ సైన్సెస్, తయారీ రంగం విస్తరణ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.
సేవల రంగంలో హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్‌గా ఎదిగి.. జీసీసీలు, కృత్రిమ మేథస్సు స్టార్ట్‌ప్సలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని తెలిపింది.
అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధి ద్వారా గ్లోబల్ లీడింగ్ స్టేట్ అవ్వాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది.
సేవల రంగం వాటా 68.6 శాతం ఉందని, ఐటీ, జీసీసీ, ఏఐ స్టార్ట్‌పలలో హైదరాబాద్ ముందువరుసలో నిలిచిందని వెల్లడించింది.
విద్యుత్తు, రోడ్లు, మెట్రో రవాణా, టీ ఫైబర్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొంది.
23,187 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం, 1.98 కోట్ల విద్యుత్తు కనెక్షన్లు, ఉచిత విద్యుత్తు పథకాలు మౌలిక వసతుల వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది.
రాష్ట్రంలో 39,641 పాఠశాలలు ఉన్నాయని, డిజిటల్ బోధన పెరుగుతోందని, కొత్తవర్సిటీలు, రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని సర్వే నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ముఖ్య అంశాలను పరిశీలిస్తే..
రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఈ వృద్ధి కోసం క్యూర్, ప్యూర్, రేర్ అనే ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకుంది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2025-26 అంచనాల ప్రకారం.. తెలంగాణ జీఎస్డీపీ రూ.17.82 లక్షల కోట్లుగా ఉంది.
రాష్ట్ర వృద్ధిరేటు 10.7 శాతం కాగా ఇది జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం కంటే చాలా ఎక్కువ.
భారత దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2024-25లో 4.87 శాతం ఉండగా, ఇది 2025-26 నాటికి 4.99 శాతానికి పెరిగింది.
తలసరి ఆదాయం 2025-26లో రూ.4,18,931కి చేరింది. ఇది జాతీయ సగటు రూ.2,19,575 కంటే రెట్టింపు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో సేవా రంగం మూడో స్థానంలో ఉంది. 68.6 శాతం వాటాతో అగ్రస్థానంలో రాష్ట్రం నిలిచింది.
ఇది జాతీయ సగటు 56.4 శాతం కంటే మెరుగ్గా ఉంది.
జిల్లా స్థాయి గణాంకాలను పరిశీలిస్తే 2024-25 అంచనాల ప్రకారం రంగారెడ్డి జిల్లా.. స్థూల జిల్లా ఉత్పత్తి, తలసరి ఆదాయంలో (రూ.11,29,735) మొదటి స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ ఆ తరువాతి స్థానంలో ఉంది..
రాష్ట్రంలో కార్మిక శక్తి అక్టోబరు-డిసెంబరు 2025 కాలంలో పనిచేసే కార్మికుల శాతం 60.7 శాతంగా ఉంది.
మహిళల భాగస్వామ్యం రేటు 45.4 శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు 34.9 శాతం కంటే చాలా ఎక్కువ.
ఉద్యోగ నిష్పత్తి పరిశీలిస్తే రాష్ట్ర కార్మికుల జనాభా నిష్పత్తి 57.0 శాతంగా ఉంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ నిష్పత్తి 62.5 శాతం, పట్టణ ప్రాంతాల (49.5 శాతం) కంటే ఎక్కువగా ఉంది.
జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో రూ.11, 29,735 లక్షలతో రంగారెడ్డి జిల్లా మొదటి ర్యాంకులో నిలిచింది.
రూ.2,37,809తో హనుమకొండ జిల్లా 33వ ర్యాంకులో ఉంది.
రెవెన్యూ వ్యయంలో 78.9 శాతం అభివృద్ధి పనులకు
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3, 04,865 కోట్లు కాగా, ఇందు లో రెవెన్యూ వ్యయం రూ.2.26, 982 కోట్లు, మూలధన వ్యయం రూ.36, 504 కోట్లు.
రెవెన్యూ వ్యయంలో 78.9 శాతం నిధులను అభివృద్ధి పనులకు కేటాయించారు.
బడ్జెట్లో మొత్తం రాబడులు 3,04,367 కోట్లు కాగా, ఇందులో రెవెన్యూ రాబడులు రూ.2,29,721 కోట్లు, మూలధన రాబడి రూ.74,646 కోట్లు.
అప్పులు, చెల్లింపులకు సంబంధించి.. డిసెంబరు 2023 నుంచి డిసెంబరు 2025 వరకు రాష్ట్రం, దాని అనుబంధ సంస్థల మొత్తం అప్పులు రూ.3,19,179 కోట్లు.
అయితే ఇదే కాలం లో అసలు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.3,04,202 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొంది.
పాత అప్పుల భారం వల్ల కొత్తగా తీసుకున్న అప్పుల్లో ఎక్కువ భాగం పాత బకాయిల చెల్లింపులకే సరిపోయిందని తెలిపింది.
కేంద్రం నుంచి వచ్చేది తక్కువే..
కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న ప్రతి రూపాయికి బదులుగా, తిరిగి వస్తోంది కేవలం 42 పైసలేనని తాజా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది.
కేంద్ర ఆర్థిక శాఖ, జీఎస్టీ పోర్టల్ గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం, 2018-19 నుంచి 2022-23 వరకు ఐదేళ్ల కాలంలో తెలంగాణకు సగటున 0.42 పైసలు మాత్రమే తిరిగి వచ్చాయి.
2018-19లో రూపాయికి 60 పైసలు రాగా, అది 2022-23 నాటికి 39 పైసలకు పడిపోయింది.
తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ(49 పైసలు), తమిళనాడు (26పైస లు), కర్ణాటక(16పైసలు) వంటివి తమ వాటాలో భారీ కోతను ఎదుర్కొంటున్నాయి.
కాగా అభివృద్థి చెందిన రాష్ర్టాల కంటే, వెనుకబడిన రాష్ర్టాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ఒక రూపాయి పన్ను చెల్లిస్తే, దానికి బదులుగా కేంద్రం నుంచి రూ.6.06 తిరిగి పొందుతోంది.
అలాగే ఉత్తరప్రదేశ్ కూడా రూపాయికి రూ.2.03 పొందుతూ లాభపడుతోంది.
జాతీయ సగటు 42 పైసలు ఉండగా, మన రాష్ట్రానికి కూడా అంతే వస్తోంది. అయితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 46 పైసలు అందుతున్నాయి.
సంపద వికేంద్రీకరణకు వ్యూహం..
మెట్రోపాలిటన్ ప్రాంతం (కోర్ అర్బన్ రీజియన్)లో అధిక వృద్ధిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం 2053 చదరపు కి.మీ. విస్తీర్ణంలో క్యూర్ పేరుతో నెట్ జీరో, సర్వీసెస్ ఓన్లీ మెట్రోపాలసీని ఏర్పాటు చేస్తోంది.
సంపదను వికేంద్రీకరించడానికి పాలీసెంట్రిక్ రీజినల్ అర్బన్ క్లస్టర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ట్రాఫిక్ నియంత్రణ కోసం ఉత్తర హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా హెచ్ఎండీఏ రూ.7406 కోట్ల అంచనాతో మూడు వ్యూహాత్మక ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించబోతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో వంద శాతం మురుగునీటి శుద్ధి సాధించే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది.
దీని మొత్తం సామర్థ్యం రోజుకు 1878 మిలియన్ లీటర్లకు చేరుకుంది.
హైడ్రా ద్వారా ప్రభుత్వం 1045.12 ఎకరాల ప్రభుత్వ భూమిని, జలవనరులను స్వాధీనం చేసుకుంది.
వీటి విలువ సుమారు రూ.60 వేల కోట్లు అని నివేదికలో వెల్లడించింది. బిల్డ్‌నౌ 66 అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల పరిశీలన కేవలం 1 నిమిషం 31 సెకన్లలో పూర్తి చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది.
మూసీ ప్రక్షాళన కింద 55 కి.మీ మేర మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.
మొదటి దశ పనులు రూ.5863 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్నాయి.
అర్బన్ ఫైనాన్స్ కింద రూ.1881.14 కోట్ల అధిక వడ్డీ రుణాలు చెల్లించడం, వడ్డీ రేటు 7.95 శాతానికి తగ్గించడం ద్వారా ప్రభుత్వం రూ.262 కోట్ల వడ్డీని ఆదా చేసింది.
భవిష్యత్తు ప్రణాళికల కోసం 2053 చ.కి.మీ కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి 3డి డిజిటల్ ట్విన్, జీఐఎస్ ఆధారిత నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడ వద్ద దేశంలోనే అతిపెద్ద ఎకో హిల్పార్కును ప్రారంభించింది.
ఈ పార్కును 4.8 ఎకరాల్లో ఏర్పాటు చేయగా.. అక్కడ 8వేల విదేశీ పక్షలు నివాసం ఉంటున్నాయి.
సంక్షేమ పథకాలకు 44.90 శాతం
గత బడ్జెట్లో అన్ని రకాల సంక్షేమ పథకాలకు కలిపి రూ.1.04 లక్షల కోట్లు కేటాయిస్తే వచ్చే ఏడాదికి ఈ పద్దు కింద రూ.1,45,591 కోట్లను ప్రతిపాదించింది.
మొత్తం బడ్జెట్ వ్యయంలో సంక్షేమ పథకాలకు కేటాయింపులు 44.90% కాగా.. గత బడ్జెట్లో ఇది 34.21%. దీనిని 10%పైగా పెంచడం ద్వారా సంక్షేమ పథమే తమ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసింది.
మొత్తం 69 రకాల సంక్షేమ పథకాలను వివిధ శాఖల్లో అమలుచేస్తున్నారు.