తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్‌లో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు.
బడ్జెట్ స్వరూపం:
తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
వృద్ధి రేటు 10.2శాతం
బడ్జెట్ గణాంకాలు, కేటాయింపులు:
ఇందులో వ్యవసాయశాఖకు రూ. 23,179 కోట్లు,
విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు,
పౌరసరఫరాలశాఖకు రూ. 7,366 కోట్లు,
పశుసంవర్థకశాఖకు రూ. 1529 కోట్లు,
విద్యాశాఖ కు రూ. 26,674 కోట్లు,
వైద్యశాఖకు రూ. 13,679 కోట్లు,
కార్మికశాఖకు రూ. 998 కోట్లు,
మహిళ శిశు సంక్షేమాశా ఖకు రూ.3143 కోట్లు,
పర్యటక రంగానికి రూ. 1224 కోట్లు,
ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు,
ఎస్టీ సంక్షేమానికి రూ.7934 కోట్లు,
బీసీ సంక్షేమానికి రూ 12, 511 కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ. 3769 కోట్లు,
ఆరోగ్య శ్రీకి రూ. 1143 కోట్లు,
ఉపకార వేతనాలకు రూ. 4343 కోట్లు,
కల్యాణలక్ష్మి పథకానికి రూ.3683 కోట్లు,
గృహజ్యోతి పథకానికి రూ. 2080 కోట్లు,
మహలక్ష్మి పథకానికి రూ. 4305 కోట్లు,
ఇందిరమ్మ ఇండ్లకు రూ. 5500 కోట్లు,
చేయూత పథకానికి రూ. 14,861 కోట్లు,
రైతుభరోసాకు రూ. 18వేల కోట్లు,
అరు గ్యారంటీల అమలుకు రూ. 50,713 కోట్లు,
యంగ్ ఇండియా స్కూళ్లకు రూ. ఐదు వేల కోట్లు కేటాయించారు.
రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు
సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు
రాజీవ్ యువ వికాసం – రూ.6వేల కోట్లు
గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు
ఐటీ రంగం – రూ.875 కోట్లు
పరిశ్రమలు – రూ.3,490 కోట్లు
చేనేత – రూ.258 కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.33,688 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులు – రూ.22,615 కోట్లు
రవాణా శాఖ – రూ.12,759 కోట్లు
న్యాయ శాఖ – రూ.2,367 కోట్లు
పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ – రూ.17,907కోట్లు
శాంతి భద్రతలు – రూ.11,907 కోట్లు
గోదావరి పుష్కరాలు – రూ.500 కోట్లు
పర్యాటక శాఖ – రూ.1,224 కోట్లు
పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు 6416కోట్లు
హ్యాంమ్ రోడ్లకు 3053కోట్లు
రీజనల్ రింగ్ రోడ్డుకు 1525కోట్లు
రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000కోట్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు
పంట బీమా పథకానికి 1886 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ కు 1500కోట్లు
CURE ఏరియా అభివృద్ధికి 2654కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056కోట్లు
ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు
రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931
రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2024-25లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,80,031 ఉండ గా.. 2025-26లో అది 4,18,931కు పెరిగింది.
ఇది దేశ తలసరి ఆదాయం కంటే రెట్టింపు
ఈ ఏడాది జీఎస్‌డీపీ వృద్ధిరేటు 10.7 శాతం
2024-25లో 9.8 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, 2025-26లో 10.2 శాతం వృద్ధి రేటు నమోదైంది.
దేశ తలసరి ఆదాయం 2024-25లో రూ.2,05,324 ఉండగా.. 2025-26లో 2,19,575గా ఉంది.
2024-25లో దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.7 శాతం ఉండగా.. ఈ ఏడాది 6.9 శాతంకే పరిమితమైంది.
2025-26లో దేశ తలసరి ఆదాయం (రూ.2,19,575)కంటే తెలంగాణ తలసరి ఆదాయం (రూ.4,18, 931) దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(GSDP) సైతం భారీగా పెరిగింది.
ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీ రూ.17,82,198 కోట్ల మేర నమోదవగా.. 2024-25లో ఇది 16,09,902 కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GSDP వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదైంది.
2024-25లో దేశ GDP వృద్ధి రేటు 9.8 శాతం కాగా.. 2025-26లో అది 8 శాతానికే పరిమితమైంది.
అలాగే, 2024-25లో దేశ జీడీపీలో తెలంగాణవాటా 4.97 శాతం ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.99శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.
ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కోత
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్ గతేడాది కంటే తగ్గింది.
మరోవైపు, ఈ గ్యారంటీలకు గతేడాది కేటాయించిన బడ్జెట్‌లో కేవలం రూ.35,706 కోట్లనే ఖర్చు చేశారు. రైతుభరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినప్పటికీ అందులో కేవలం రూ.8,744(48.52 శాతం) కోట్లే ఖర్చు చేశారు.
ఇక, ఇందిరమ్మ ఇళ్లకు గత బడ్జెట్‌లో రూ.12,571 కోట్లు కేటాయించగా, వాస్తవ ఖర్చు రూ.5,073 కోట్లే అయింది.
ఈ బడ్జెట్‌లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులను సగం కంటే ఎక్కువగా తగ్గించి కేవలం రూ.5,500కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే రూ.7,071కోట్లు తగ్గించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ భూమి లేని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించగా అందులో కేవలం రూ.55 కోట్లే ఖర్చు చేసింది.
ఇదిలా ఉండగా, ఈసారి సన్నధాన్యానికి బోనస్ కేటాయింపులు గతేడాది కంటే అదనంగా మరో రూ.1700 కోట్లు పెంచి రూ.3,500కోట్లు కేటాయించారు.
ఆరోగ్యానికి భారీగా నిధుల పెంపు
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేసింది.
మొదటిసారి రూ.13,679 కోట్లు కేటాయించింది.
వైద్యవిద్యకు పెద్దపీట వేసింది. మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
వైద్యవిద్య సంచాలకుల విభాగానికి ఏకంగా రూ.6,681 కోట్లు కేటాయించింది.
మొత్తంగా ఆరోగ్య బడ్జెట్‌లో 48.77 శాతం నిధులు డీఎంఈ విభాగానికే కేటాయించింది.
ప్రధానంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.381 కోట్లు,
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.252 కోట్లు,
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కొత్త కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.100 కోట్లు,
నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం రూ.140 కోట్లు కేటాయించింది.
బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి గతేడాది రూ.12,393 కోట్లు కేటాయించగా, ఈమారు మరో రూ.1,286 కోట్లు పెంచింది. అంటే గతేడాదికంటే అదనంగా 9.40 శాతం నిధులు పెరిగాయి.
ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ. రూ.6,984 కోట్లు కేటాయించగా, ప్రగతి పద్దు(జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దు కింద పరిగణిస్తారు) కింద రూ.6,695 కోట్లు చూపింది.
గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈసారి ప్రగతి పద్దు రూ.31 కోట్లు తగ్గగా.. అదే సమయంలో నిర్వహణ వ్యయం రూ.1,317 కోట్లు పెరిగింది.
ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా బడ్జెట్‌లో ఇందుకు రూ.1,093 కోట్లు కాంట్రిబజీ్యూషన్ కింద చెల్లిస్తామని ప్రకటించింది.
గతేడాది రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.1,143 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లోనూ అంతే కేటాయించారు.
ఇప్పటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా నడుస్తోన్న తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 12,720 బెడ్‌లను ప్రభుత్వం సెకండరీ హెల్త్‌కేర్ కిందకు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించింది.
టీవీవీపీ ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్ కోసం రూ.164కోట్లు,
టీవీవీపీ ఆస్పత్రుల్లో సర్జికల్స్, ఎక్విప్‌మెంట్, రీజెంట్స్ కొనుగోలు కోసం రూ.87 కోట్లు,
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచడం, వన్యప్రాణుల్ని, జీవవైవిధ్యాన్ని సంరక్షించడమే లక్ష్యంగా బడ్జెట్‌లో మొత్తం అటవీ, పర్యావరణశాఖలకు రూ.1,049 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్‌లో ఇది రూ.1,023 కోట్లు. ఇందులో ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు రూ.874 కోట్లు, స్కీముల కోసం రూ.124 కోట్లు.. మిగతావి ఇతర పద్దుల కింద పేర్కొంది.
సిద్దిపేట జిల్లా ములుగులో అటవీ యూనివర్సిటీకి రూ.93 కోట్లు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ సహా జంతు ప్రదర్శనశాలలకు రూ.18 కోట్లు,
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో సంక్షేమ శాఖలకు గత బడ్జెట్ కంటే ఈసారి నిధుల కేటాయింపు పెరిగింది.
షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) అభివృద్ధికి క్రితం బడ్జెట్‌లో రూ.11,561 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) అభివృద్ధికి గత బడ్జెట్‌లో రూ.7,522 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.7,937 కోట్లకు పెంచారు.
గత ఏడాదితో పోల్చితే ఈ కేటాయింపుల్లో దాదాపు 12-15 శాతం వృద్ధి కనిపిస్తోంది.
మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.2,862 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో రూ.3,143 కోట్లకు పెంచారు.
సంక్షేమ కార్పొరేషన్లకు నిధులు
ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
సీఎంఎస్టీఈఐ (ట్రైకార్) పథకం రూ.50 కోట్లు
అత్యంత వెనుకబడిన తరగతులు రూ.400 కోట్లు
బీసీ సహకార ఆర్థిక సంస్థకు రూ.640 కోట్లు
వివిధ సహకార సమాఖ్యలకు రూ.50 కోట్ల చొప్పున
ఈబీసీ ప్రత్యేక ఆర్థిక సాయం రూ.50 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో కేటాయింపులు పెంచింది.
యువత స్వయం ఉపాధి పథకాలకు పెద్దపీట వేసింది.
రాజీవ్ యువవికాసం కింద అన్ని సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలో కలిపి రూ.200 కోట్లతో ‘ఆటో రిక్షాల పథకం’ అమలు చేయనుంది.
ఎస్సీ వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,500 కోట్లు ప్రత్యేకంగా పేర్కొంది.
సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి గతేడాది బడ్జెట్‌తో పోల్చితే రూ.1,922 కోట్లు అదనంగా ఇచ్చి.. రూ.36,001 కోట్లుగా పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి కింద రూ.37,893 కోట్లు కేటాయించింది.
సంక్షేమవర్గాలు, పేద పిల్లల ఉన్నత విద్య కోసం సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది.
సంక్షేమ శాఖల్లో ఈ గురుకులాల కోసం రూ.4,550 కోట్లు కేటాయించింది.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన సహకార సమాఖ్యలు, కార్పొరేషన్లకు రూ.50 కోట్ల చొప్పున నిధులు ప్రకటించింది.
ఎస్సీల్లో స్వయం ఉపాధి పథకాల కోసం సీఎం దళిత సాధికారత పథకానికి రూ.వెయ్యి కోట్లు, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తల పథకానికి రూ.50 కోట్లు కేటాయించింది.
ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపి ఎస్సీల సంక్షేమానికి రూ.37,741 కోట్లు,
గిరిజన సంక్షేమానికి రూ.18,744 కోట్లు,
బీసీల సంక్షేమానికి రూ.12,511 కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ.3,769 కోట్లతో కలిపి మొత్తం సంక్షేమ శాఖలకు రూ.73,894 కోట్లు కేటాయించింది.
కుటుంబాలకు జీవిత బీమా
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత, ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
దురదృష్టవశాత్తు, అకస్మాత్తుగా ఇంటి పెద్ద మరణిస్తే సదరు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న భావనతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకురాబోతోంది.
ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా, పథకం కోసం ఈ బడ్జెట్‌లో రూ.4వేల కోట్లను కేటాయించింది.
ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందించనుంది.
రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. కాగా ఈ పథకం కోసం కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకోనున్నారని, ఇంటి పెద్దకే బీమాను వర్తింపచేసే అవకాశాలున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
హైదరాబాద్ భద్రతకు భారీగా నిధులు
శాంతిభద్రతల విభాగానికి ప్రభుత్వం రూ.11,907 కోట్లు కేటాయించింది.
గత ఏడాది రూ.10,135కోట్లతో పోలిస్తే హోంశాఖకు రూ.1772 కోట్ల బడ్జెట్ కేటాయింపులు పెంచారు.
దాదాపు 17శాతం పెరుగుదల కన్పించింది. అర్బన్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ 4 కమిషనరేట్లకు రూ.3,781కోట్లు కేటాయించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌తో పాటు, హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు
వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు కేటాయించింది.
2026-27 ఆర్థిక సంవత్సర మొత్తం బడ్జెట్‌లో ఇది 10 శాతంకంటే ఎక్కువే.
గతేడాది ఈ శాఖకు రూ.31,605 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,083 కోట్లు పెంచారు
ఆరు గ్యారంటీలు
ఈ బడ్జెట్‌లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది.
ఆరు గ్యారంటీల అమలుకు మొత్తం రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, సన్న వడ్లకు కేటాయింపులు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
6 గ్యారంటీలకు రూ.50,713 కోట్లు
రైతు భరోసా – రూ.18,000 కోట్లు
చేయూత – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్ – రూ.3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) – రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ – రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సబ్సిడీ – రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
పవర్ సబ్సిడీ – రూ.14,000 కోట్లు
బియ్యం సబ్సిడీ – రూ.3,000 కోట్లు
కల్యాణ లక్ష్మి / షాది ముబారక్ – రూ.3,683
విద్యార్థుల డైట్ ఛార్జీలు – రూ.2,170 కోట్లు
స్కాలర్‌షిప్‌లు – రూ.4,343 కోట్లు
తప్పనిసరి కార్యాలయ ఖర్చులు – రూ.2,323 కోట్లు
విదేశీ విద్యకు రూ.480 కోట్లు..
రాష్ట్రంలో సంక్షేమ వర్గాల విదేశీ విద్య పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.480 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వం 2025-26 నుంచి విదేశీ ఉపకారవేతనాల సంఖ్యను 1,110 నుంచి 1,900కు పెంచింది.
అయితే, తాజా బడ్జెట్ కేటాయింపులు ఆ మేరకు లేవు.
బీసీ సంక్షేమ శాఖలో విదేశీ విద్య పథకానికి రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చారు.
గురుకులాల్లో ఆధునిక కిచెన్‌లు..
గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు పెంచింది. డైట్ కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడంతోపాటు ఆధునిక కిచెన్‌లు నిర్మించనుంది. ఈ మేరకు ఒక్కో గురుకుల సొసైటీకి రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది.
ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ టవర్ నిర్మాణానికి రూ.25 కోట్లు, బాబూ జగ్జీవన్‌రామ్ హాల్ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇచ్చింది. అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రానికి రూ.100 కోట్లు ఇచ్చింది.
యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి ఎస్సీ గురుకుల సొసైటీకి రూ.2,500 కోట్లు, బీసీ సొసైటీకి రూ.1,000 కోట్లు, మైనార్టీ సొసైటీకి రూ.3,00 కోట్లు, ఎస్టీ గురుకుల సొసైటీకి రూ.750 కోట్లుగా పేర్కొంది.
గిరిజన సంక్షేమ శాఖలో విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాల కోసం రూ.915.14 కోట్లు, గిరిజనులకు స్కిల్ ట్రైనింగ్ కోసం రూ.75 కోట్లు ప్రత్యేకంగా ప్రస్తావించింది.
పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘ఇందిరా జలవికాసం’ పథకానికి బడ్జెట్‌లో రూ.600 కోట్లు, గిరిజన ఆవాసాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.900 కోట్లు పేర్కొంది.
సెలూన్‌లు, ధోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్తు కోసం ఆయా ఫెడరేషన్లకు రూ.250 కోట్లు ప్రస్తావించింది.
ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు రూ.100 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో శిక్షణ కోసం రూ.30 కోట్లు ఇచ్చింది.
ఉపకార వేతనాలకు రూ.4,452 కోట్లు
రాష్ట్రంలో సంక్షేమవర్గాల బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4,452 కోట్లు కేటాయించింది.
పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వ కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి.
2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,683 కోట్లు కేటాయించింది.
అయితే, ప్రస్తుత ఏడాదికి దాదాపు లక్ష వరకు దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తుల డిమాండ్ రూ.1,000 కోట్లు ఉంది.
భారీగా ప్రత్యేక అభివృద్ధి నిధులు..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఆయా వర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) కింద ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
నిబంధనల ప్రకారం ప్రణాళిక వ్యయంలో ఆయా వర్గాల జనాభా ఆధారంగా కేటాయింపులు చేయాలి. కానీ, ప్రభుత్వం అంతకు మించి కేటాయింపులు చేసింది. ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల కింద 2026-27కు రూ.56,486 కోట్లు (ఆయా సంక్షేమ శాఖల బడ్జెట్‌తో కలిపి)గా పేర్కొంది.
తెలంగాణలో ఎస్సీ జనాభా 15.45 శాతం కాగా.. ప్రభుత్వం ప్రగతి పద్దులో ఎస్సీ ఎస్‌డీఎఫ్ కింద 20.47 శాతం కేటాయింపులు చేసింది.
ఎస్టీల జనాభా 9.08 శాతం కాగా.. 10.16 శాతం మేర ఎస్టీ ఎస్‌డీఎఫ్ నిధులిచ్చింది.
రాష్ట్రంలో పనిచేస్తున్న, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న కార్మిక బలగంతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
15 ఏళ్లకు పైబడిన 60.7శాతం కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు.
దేశంలో సంఘటిత తయారీ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో తెలంగాణ ఐదు శాతం వాటా కలిగి ఉందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.
తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, హరియాణా తర్వాత ఏడో స్థానంలో ఉన్నట్లు సర్వే వివరించింది.
రాష్ట్ర కార్మిక బలగంలో మహిళల వాటా గణనీయంగా పెరిగి 45.4శాతానికి చేరింది. జాతీయ సగటు 34.9 శాతమే.
ఏటీసీ విద్యార్థికి నెలకు రూ.2 వేలు
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 కోట్లు కేటాయించింది.
విదేశాల్లో ఉపాధి కల్పన కోసం ప్రత్యేకంగా సీఎం విదేశీ ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం అమలుకు రూ.50 కోట్లు వెచ్చించనుంది.
కార్మిక శాఖకు 2026-27 ఏడాదికి బడ్జెట్‌ను రూ.997.87 కోట్లుగా ప్రతిపాదించింది.
ఇప్పటికే 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలు (ఏటీసీ)గా ఉన్నతీకరించారు.
2025-26లో ఆ శాఖకు రూ.371 కోట్లను కేటాయించగా.. ఈ సారి రూ.113 కోట్ల మేర తగ్గించి రూ.258 కోట్ల కేటాయించారు.
చేనేత రంగంలో సంక్షోభం దృష్ట్యా నిధులను భారీఎత్తున కేటాయించాలని ఆ శాఖతో పాటు చేనేత సంఘాలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా ఫలితం దక్కలేదు.
నేతన్నల పొదుపు పథకానికి రూ.140 కోట్లు కేటాయించారు. ఇది నిరుటి కంటే రూ.40 కోట్లు ఎక్కువ.
నేతన్నకు భరోసా పథకానికి నిరుడు రూ.48 కోట్లు ఉండగా.. ఈ సారి రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారు.
నేతన్న భద్రతకు రూ.17.79 కోట్లు, మరమగ్గాల కార్మికులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.5 కోట్లు, పొదుపు నిధి కింద రూ.12 కోట్లను కేటాయించారు.
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అల్పాహారం, పాలు
రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌మీడియట్ వరకు విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ఈ సారి విద్యాశాఖ బడ్జెట్‌లో వినూత్న పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. సర్కారు బడులు, కళాశాలల్లో పిల్లల సంఖ్య పెంచాలని భావిస్తున్న సర్కారు.. వారి అవసరాలను గుర్తించి వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి ఉదయం అల్పాహారం, పాలు అందించే ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించనుంది.
వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉదయం అల్పాహార పథకం అమలు చేయనున్నారు. అందుకు పాఠశాలల విద్యార్థులకు రూ.504 కోట్లు, ఇంటర్ విద్యార్థులకు రూ.56 కోట్లు కేటాయించారు. దీనివల్ల మొత్తం దాదాపు 20 లక్షల మంది పేద విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 1.50 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. వారికి మధ్యాహ్న భోజనం కోసం రూ.70 కోట్లు ప్రతిపాదించారు.
ఇంటర్ చదువుతున్న దివ్యాంగులకు మూడు టైర్లతో కూడిన స్కూటీలను అందించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా వెయ్యి మందికి వీటిని ఇవ్వనున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరమే వెయ్యి పాఠశాలల్లో యూకేజీ ప్రారంభించిన ప్రభుత్వం.. 2026-27లో మరో 2 వేల నుంచి 2,500 చోట్ల ప్రారంభిస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలోని 57 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా ఉన్నతీకరించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 15 కొత్త కోర్సులను ప్రవేశపెడతారు.
యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ గురుకులాలను ఒకచోటకు చేర్చి నడిపేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం చేపట్టింది.
ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 105 నిర్మించాలని 2024లోనే శ్రీకారం చుట్టింది.
అయితే, నిధుల కొరతతో నిర్మాణాలు వేగం అందుకోలేదు.
ఒక్కో దానికి రూ.200 కోట్లు అవసరం కాగా.. గత బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు.
ఈ సారి బడ్జెట్‌లో ఏకంగా రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు.
సాగునీటి ప్రాజెక్టుల
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య, దీర్ఘకాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులుగా వర్గీకరించిన సర్కారు… మొదట ప్రాధాన్య జాబితాలో ఉన్న వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నిరుడు సాగునీటి ప్రాజెక్టులకు రూ.23,373 కోట్లు కేటాయించగా…
ఈ ఏడాది రూ.758 కోట్లు తక్కువగా రూ.22,615 కోట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
పాలమూరు జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ నీటిపారుదల సర్కిళ్లకు రూ.4,246.36 కోట్లు, నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట సర్కిళ్లకు రూ.1,906 కోట్లు ఇచ్చారు.
ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఏ-కేటగిరీ కింద ఆరింటికి, బీ-కేటగిరీలో 12 ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఏటా ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాధించాలని నీటిపారుదల శాఖ లక్ష్యానికి అనుగుణంగా భూసేకరణకు రూ.5వేల కోట్లకుపైగా ఇచ్చారు.
నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టుకు భారీగా నిధులిచ్చారు. భూసేకరణకు రూ.300 కోట్లు, ప్రధాన పనుల నిర్మాణానికి రూ.1103 కోట్లు కేటాయించారు.
నల్గొండ జిల్లాల్లోని ఎలిమినేటి మాధవరెడ్డి-శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(సొరంగం) పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. SLBC తవ్వకం పనులను ఆధునిక పద్ధతిలో ఇటీవల ప్రారంభించారు.
దీంతోపాటు కాలువల విస్తరణ కూడా చేపట్టనున్నారు. అయితే కేటాయింపల్లో నిరుటితో పోల్చితే రూ.100 కోట్లు తగ్గాయి.
డిండి ఎత్తిపోతల పథకానికి గత ఏడాది కన్నా రూ.200 కోట్లు అధికంగా ఇచ్చారు.
భూసేకరణ, పునరావాసం పనులు కీలకంగా ఉన్నాయి. సూర్యాపేట నీటిపారుదల సర్కిల్లో శ్రీరాంసాగర్ రెండోదశ కింద కాలువలను పూర్తి చేసేందుకు రూ.276.86 కోట్లు కేటాయించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.308 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.177 కోట్లు అదనంగా కేటాయించారు.
2024-25లో రూ.123 కోట్లు కేటాయించినా రూ.307 కోట్ల వరకు వెచ్చించారు.
ఈ పథకం మూడో దశ విస్తరణ పనులు కీలకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ పథకం ఏఐబీపీ కింద కూడా నిధులు సాధించేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు 5.57 లక్షల ఎకరాలు కాగా మరో 2.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది.
సీతమ్మసాగర్ బ్యారేజీకి రూ.15.97 కోట్లు కేటాయించారు. ఖమ్మం నీటిపారుదల సర్కిల్ పరిధిలో నాగార్జునసాగర్‌పై నిర్మించే ఎత్తిపోతలకు రూ.370.99 కోట్లు కేటాయించారు.
సాగర్ కింద నీరందని చివరి ఆయకట్టును ఆదుకునేలా ఈ నిర్మాణం చేపడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని చనఖా-కోర్ట(లోయర్ పెన్‌గంగ)కు రూ.177.54 కోట్లు కేటాయించారు.
భూసేకరణకు అధిక నిధులు వెచ్చించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ. 400 కోట్లు కేటాయించారు.
కృష్ణా బేసిన్‌లోని జూరాలను, వరంగల్ జిల్లాలో గోదావరి బేసిన్‌లోని పాకాలను అనుసంధానం చేసేందుకు ప్రతిపాదిస్తున్న జూరాల-పాకాల ఎత్తిపోతలకు రూ.కోటి కేటాయించారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి గతేడాది మాదిరే రూ.800 కోట్లు ఇచ్చారు.
ఈ పథకం కింద కాలువల విస్తరణ, పిల్లకాలువల వ్యవస్థ నిర్మాణం, భూ సేకరణ కీలకంగా ఉంది.
ఇది పూర్తయితే 1.44 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇప్పటివరకు రూ.2.65 లక్షల కోట్ల వ్యయం చేశారు.
ఇందులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా రూ.69,966 కోట్లు,
తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.15,284 కోట్లు అప్పుల కింద తీసుకొచ్చి ఖర్చు చేశారు.
రాష్ట్రంలో 34 భారీ, 39 మధ్య, చిన్న తరహా కలిపి మొత్తం 73 ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇప్పటివరకు 10 భారీ, 32 మధ్య తరహా ప్రాజెక్టులు కలిపి 42 పూర్తయినట్లు తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్-2026 నివేదిక వెల్లడించింది.
వ్యవసాయశాఖకు
తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.23,179 కోట్లను వ్యవసాయశాఖకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో యాంత్రీకరణకు పెద్దపీట వేసింది. 2025-26లో రూ.100 కోట్లు ఇవ్వగా… ఇప్పుడు రూ.344 కోట్లకు పెంచింది.
పంటల బీమా పథకం అమలుకు రూ.1886 కోట్లను కేటాయించింది.
పథకం అమలు కానప్పటికీ నిరుటికంటే రూ.586 కోట్లు పెరిగాయి.
ప్రస్తుతం సన్నవడ్ల సాగుకు ఇస్తున్న బోనస్ పథకాన్ని మరిన్ని పంటలకు విస్తరించేందుకు వీలుగా రూ.3500 కోట్లను కేటాయించింది.
రైతుభరోసాకు యథాతథంగా రూ.18,000 కోట్ల కేటాయింపులను కొనసాగించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,439 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.23,179 కోట్లను అంటే రూ.1260 కోట్లు తక్కువ కేటాయించింది.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో రైతు బీమా పథకాన్ని విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ పద్దుకు ప్రత్యేకంగా కేటాయించలేదు. నిరుటి బడ్జెట్‌లో దీనినిమిత్తం రూ.1289 కోట్లను కేటాయించింది.
ఆ పథకాన్ని మినహాయించినందున వ్యవసాయశాఖకు కేటాయింపులు నిరుటికంటే రూ.29 కోట్లు ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయవర్గాలు తెలిపాయి.
మొత్తం రూ.23,179 కోట్లలో రూ.1328 కోట్ల పాలనావ్యయం కాగా రూ.21,851 కోట్లను పథకాల అమలుకు ఇవ్వనున్నారు.
వచ్చే రెండు సీజన్లకు రైతుభరోసా
రైతుభరోసా కింద గత ఏడాది రూ.18,000 కోట్లను కేటాయించిన ప్రభుత్వం గత ఏడాది వానాకాలం సీజన్‌లో రూ.8881 కోట్లను పంటకాలానికి విడుదల చేసింది.
ఈనెల 22న యాసంగి సీజన్‌కు వాటిని విడుదల చేస్తోంది. యాసంగి ముగింపుదశలో ఉన్నందున వచ్చే వానాకాలం సీజన్‌కు వీటితోనే సరిపెడతారని అంతా భావించినా ప్రభుత్వం 2026-27కి రూ.18,000 కోట్లను కేటాయించడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు సీజన్‌లకు నిధులు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
యాంత్రీకరణ
సాగు వ్యయం, రైతులకు శ్రమ, ఎరువుల వాడకం తగ్గించేందుకు యాంత్రీకరణ పథకాన్ని 2025-26లో పునరుద్ధరించి రూ.100 కోట్లను కేటాయించింది. దానికి స్పందన రావడంతో పథకాన్ని విస్తరించి, రైతుల ఖాతాల్లోనే నేరుగా సాయం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేటాయింపులను రూ.344 కోట్లకు పెంచింది..
పంటల బీమా
‘పంటల బీమా’ అమలుకు 2025-26లో సంవత్సరంలో రూ.1300 కోట్ల కేటాయింపులు జరిగాయి. విధివిధానాలు ఖరారు కానందున అది అమలు గాక నిధులు మిగిలిపోయాయి. ఈ పథకం 2026-27 వానాకాలం సీజన్ నుంచి అమలు చేయాలనే సంకల్పంతో ఉంది. ఈక్రమంలో దీని అమలుకు రూ.1886 కోట్లను కేటాయించింది.
కూరగాయలు, పండ్ల సాగుకు ప్రోత్సాహం
రాష్ట్రంలో కూరగాయల సాగు లక్ష ఎకరాల్లో ఉండగా.. ఇతర ఉద్యాన పంటలు మరో 12 లక్షల ఎకరాల మేరకు ఉంది.
2026-27 నుంచి ఏటా లక్ష ఎకరాల మేరకు ఉద్యాన పంటలు విస్తరించాలని నిర్ణయించింది.
దీంతోపాటు పామాయిల్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 68,000 ఎకరాల్లో పెంచేందుకు సబ్సిడీలు, రాయితీలు విస్తరించాలని భావిస్తోంది.
మొత్తంగా 2.64 లక్షల ఎకరాల్లో సూక్ష్మ, బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా రూ.2200 కోట్ల మేర సాయం అందించనుంది.